ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ 3.0 ప్రభుత్వం ఆదివారం ఏర్పడింది. మొత్తం 72 మంది ఎంపీలు కేబినెట్ మంత్రులుగా, కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత రెండు పర్యాయాలు లేని విధంగా ఈసారి ఎక్కువమంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఎన్డీఏ మంత్రివర్గంలో చేరారు. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన 24 గంటల వ్యవధిలోనే కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ సురేష్ గోపి చేసిన ప్రకటన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
తనకు మంత్రి పదవి వద్దని, త్వరలో ఆ పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారు. సోమవారం కేరళకు చెందిన ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన ఆయన.. తనకు దక్కిన పదవి నుంచి రిలీవ్ కావాలనుకుంటున్నాను. తాను మంత్రి పదవి అడగలేదని, త్రిసూర్ ప్రజల కోసం ఎంపీగానే పని చేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు సురేష్ గోపి తాను పలు సినిమాలకు సంతకం చేశానని, వాటిని ఎలాగైనా పూర్తి చేయాల్సిందేనని అన్నారు. ‘ఎంపీగా పనిచేయడమే నా లక్ష్యం.. నేనేమీ అడగలేదు.. నాకు ఈ పదవి అవసరం లేదని చెప్పాను.. త్వరలోనే ఆ పదవి నుంచి రిలీవ్ అవుతానని అనుకుంటున్నా. త్రిసూర్ ఓటర్లతో ఎలాంటి ఇబ్బంది లేదు. వారికి తెలుసు, ఎంపీగా నేను వారి కోసం ఎంతైనా పనిచేస్తాను. నేను నా సినిమాలను ఎలాగైనా తీయాల్సి ఉందని ‘ సురేష్ గోపి పేర్కొన్నారు.