ఆధ్యాత్మికత ముసుగులో అకృత్యాలకు పాల్పడిన జిలేబీ బాబా పాపం పండింది. మహిమల పేరిట మహిళల్ని తన దగ్గరకు వచ్చేలా చేసి వారిపై దురాగతాలకు పాల్పడిన ‘జిలేబీ బాబా’కు న్యాయస్థానం 14ఏళ్లు కారాగార శిక్ష విధించింది. 120 మంది మహిళలపై అత్యాచారం చేసి, వీడియో తీసి డబ్బుల కోసం వారిని బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో ఫతేహాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ‘జిలేబీ బాబా’కు కోర్టు జైలు శిక్షతో పాటు రూ.35వేలు జరిమానా విధించింది.
జిలేబీ బాబా(63) అసలు పేరు అమర్‌వీర్. ఇది కాకుండా అతడికి అమర్‌పురి, బిల్లూరామ్ అని కూడా పేర్లు ఉన్నాయి. హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లా తోహనా పట్టణంలో ఉంటోన్న ‘జిలేబీ’.. తొలుత పంజాబ్‌లోని మాన్సా జిల్లా నుంచి 18ఏళ్ల వయసులోనే ఫతేహాబాద్‌కు వలస వచ్చాడు.
అక్కడే జిలేబీలు విక్రయించడం ద్వారా అతడికి ఆ పేరు స్థిరపడింది. తనకు తాంత్రిక విద్యలు తెలుసని.. వాటితో దెయ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తానంటూ ప్రజల్ని నమ్మించేవాడట. అతడి భక్తుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు సమాచారం.