ఈ నెల 19వ తేదీన లోక్సభ ఎన్నికలకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. అందులో 42 చోట్ల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువమంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ విడతలో 1,625 మంది పోటీ పడుతుండగా.. వారిలో 1,618 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ విశ్లేషించింది.
దీని ప్రకారం.. మొదటి విడతలో పోటీ చేస్తున్నవారిలో రూ.కోటి కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్న వారు 28 శాతం మంది ఉన్నారు. సగటున ఒక్కో అభ్యర్థి ఆస్తి రూ.4.51 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. ఇక ఆర్జేడీకి చెందిన నలుగురు అభ్యర్థులు కోటీశ్వరులే కాగా.. అన్నాడీఎంకేకు చెందిన 35 మంది, డీఎంకే అభ్యర్థులు 21 మంది, బీజేపీ – 69, కాంగ్రెస్ – 49, తృణమూల్ కాంగ్రెస్‌కు -4, బీఎస్పీ అభ్యర్థుల్లో 18 మందికి రూ.కోటికిపైగా ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. అత్యధికంగా ఆస్తులను ప్రకటించినవారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన నకుల్‌నాథ్ (కాంగ్రెస్, రూ.716 కోట్లు) మొదటిస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అశోక్ కుమార్ (అన్నాడీఎంకే, రూ.662 కోట్లు), దేవనాథన్ యాదవ్ (బీజేపీ, రూ.304 కోట్లు) ఉన్నారు.