ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనాపై పోరాటం చేస్తూంటే జమ్మూకశ్మీర్‌లో మాత్రం ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. శనివారం కుప్పారా జిల్లా హంద్వారాలో జరిగిన ఉగ్రదాడిలో కల్నల్ అశుతోష్ శర్మ సహా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం మరవక ముందే.. అక్కడికి కొద్ది దూరంలోనే మరోసారి ఉగ్రమూకలు దాడికి తెగబడ్డాయి.
హంద్వారా ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది లక్ష్యంగా సోమవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రత బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం.. భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు దాడిలో గాయపడ్డ జవాన్లను ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు. భద్రత బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టుగా తెలుస్తోంది.
హంద్వారా ఎన్‌కౌంటర్ జరిగి రెండు రోజులు కూడా కాకుండానే.. మరోసారి ఉగ్రదాడి చోటుచేసుకోవడంతో భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.