కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇప్పటి వరకు ఈ-కామర్స్ సంస్థలు కేవలం నిత్యావసర సరుకులను మాత్రమే డెలివరీ చేస్తూ వచ్చాయి. కానీ సోమవారం నుంచి అమలులోకి వచ్చిన లాక్‌డౌన్ 3.0 నేపథ్యంలో అనేక చోట్ల అనేక ఆంక్షలను సడలించారు. దీంతో ఈ-కామర్స్ సంస్థలు తిరిగి తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. అందులో భాగంగానే ఆయా సంస్థలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కస్టమర్లకు అన్ని రకాల వస్తువులను డెలివరీ చేసేందుకు ప్రస్తుతం ఆర్డర్లను స్వీకరిస్తున్నాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తదితర అనేక ఈ-కామర్స్ సంస్థలు గత 40 రోజుల నుంచీ కేవలం ఎసెన్షియల్ వస్తువులను మాత్రమే డెలివరీ చేస్తుండగా.. ఇకపై గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువులను కూడా డెలివరీ చేయనున్నాయి. అందుకు గాను దేశవ్యాప్తంగా ఆంక్షలను సడలించడంతో.. ఆయా సంస్థలు ఇప్పుడు నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్‌కు కూడా కస్టమర్ల నుంచి ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించాయి. ఈ క్రమంలో వినియోగదారులు ఇక నిత్యావసరాలతోపాటు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాషన్ ఐటమ్స్ తదితర అన్ని రకాల రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
అయితే ఆయా సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. శానిటైజేషన్, మాస్కులను ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను పాటిస్తూ కస్టమర్లకు వస్తువులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.