18వ లోక్‌సభ ఎన్నికల్లో 74 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019లో మహిళా ఎంపీల సంఖ్య 78 కావడం గమనార్హం. గతంలో కంటే ఐదు స్థానాలు ఈసారి తగ్గాయి. అయితే అత్యధికంగా పశ్చిమబెంగాల్ నుంచి 11 మంది విజయం సాధించారు. మొత్తం ఎన్నికల బరిలో 797 మంది నిలబడ్డారు. మిగిలిన పార్టీలన్నింటి కంటే బీజేపీ అత్యధికంగా 69 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ 41 మందికి టికెట్లిచ్చింది.
ఎన్నికల కమిషన్ సమాచారం మేరకు బీజేపీ తరఫున 30 మంది, కాంగ్రెస్ నుంచి 14, టీఎంసీ అభ్యర్థులు 11, ఎస్పీ తరఫున 4, డీఎంకే నుంచి 3, జేడీయూ, ఎల్జేపీ(ఆర్)ల నుంచి ఇద్దరేసి చొప్పున గెలుపొందారు. హేమా మాలిని (బీజేపీ), మహువా మొయిత్రా (టీఎంసీ), సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ), డింపుల్ యాదవ్ (ఎస్పీ) తమ స్థానాలను తిరిగి దక్కించుకోగా, కంగనా రనౌత్ (బీజేపీ), మీసా భారతి (ఆర్జేడీ), ప్రియా సరోజ్ (ఎస్పీ), ఇక్రా చౌదరి (ఎస్పీ) తొలి ప్రయత్నంలోనే ఎంపీలుగా గెలిచారు.