అయోధ్య రామమందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి ముస్తాబవుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ఆలయ ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించింది ఆలయ ట్రస్టు. మరోవైపు ఆలయంలో రామయ్య విగ్రహ ప్రతిష్టాపన పనుల్లో వేగం పెంచింది. అయితే ఈ రామాలయ గర్భగుడిలో పాలరాతితో చేసి బంగారు పూత పూయించిన 8 అడుగుల ఎత్తు ఉన్న సింహాసనాన్ని నెలకొల్పుతారట. ఈ పీఠంపైనే రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారట. ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉండే ఈ బంగారు సింహాసనాన్ని రాజస్థాన్‌లోని హస్తకళాకారులు తయారు చేస్తున్నారట. డిసెంబర్ 15 నాటికి ఈ సింహాసనం అయోధ్యకు చేరుకుంటుందిట.
గర్భగుడి నిర్మాణం కూడా పూర్తయిందని ఆలయ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర తెలిపారు. డిసెంబర్ 15 నాటికి రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ రెడీ అవుతుందని.. ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్లో 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్లో 17 స్తంభాలు ఏర్పాటు చేయగా, అందులో రెండింటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలోని మూడు అంతస్తుల్లో పైకప్పులు నిర్మించామని పేర్కొన్నారు.. అలాగే మందిరం ప్రవేశ ద్వారం వెలుపలి గోడ(పార్కోట) పనులు కూడా చివరి దశలో ఉన్నాయని వివరించారు.