రంగు మార్చి ఒకేసారి పట్టాలెక్కనున్న 9 వందేభారత్‌ రైళ్లు

-

సెమీ హైస్పీడ్ ‘వందే భారత్’ రైళ్లు దేశంలోని వివిధ నగరాల మధ్య ఇప్పటికే సేవలందిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని రూట్లకు చైర్‌కార్, స్లీపర్, మినీ వందే భారత్ ట్రైన్ సర్వీస్‌లను విస్తరించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 24న మరో తొమ్మిది కొత్త రైళ్లు పట్టాలపైకి రానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీటిని ప్రారంభించనున్నారు. ఏయే రూట్లలో కొత్త వందే భారత్ రైళ్లు రానున్నాయో తెలుసుకుందాం.

కేరళ, ఒడిశా రాష్ట్రాలకు రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ కేటాయించింది. ఈ రెండింటితో పాటు మరో 7 కొత్త మార్గాల్లోనూ ఈ ట్రైన్లను ప్రధానమంత్రి సెప్టెంబర్ 24న ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు బ్లూ కలర్‌లో వందే భారత్ రైళ్లు పట్టాలపైకి రాగా, ఈసారి వచ్చేవి ఆరెంజ్ (నారింజ) రంగులో ఉంటాయట.

కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాలు :
నివేదికల ప్రకారం పూరీ- రూర్కెలా, కాసర్‌గోడ్- త్రివేండ్రం, ఉదయపూర్- జైపూర్, రాంచీ-హౌరా, తిరునెల్వేలి- చెన్నై, పాట్నా-హౌరా, హైదరాబాద్- బెంగళూరు, జామ్‌నగర్-అహ్మదాబాద్, విజయవాడ- చెన్నై కొత్త మార్గాల్లో వందేభారత్ ట్రైన్లు సేవలందించనున్నాయి. ఈ 9 రూట్లలో 8-కోచ్‌ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇండియన్ రైల్వేస్ నడుపుతుంది. ప్రస్తుతం దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు మొత్తం 25 ఆపరేషనల్ రూట్స్ ఉన్నాయి. కొత్తగా తొమ్మిది మార్గాలను చేర్చడంతో, దేశవ్యాప్తంగా 34 రూట్లకు సేవలు విస్తరించనున్నాయి.

పూరీ-రూర్కెలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ : ఈ రైలు పూరి స్టేషన్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి భువనేశ్వర్‌కు ఉదయం 6.05 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రూర్కెలాకు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు రూర్కెలా నుంచి మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి రాత్రి 9.40 గంటలకు పూరీకి చేరుకుంటుంది. ఈ దూరాన్ని రైలు కేవలం 7.5 గంటల్లోనే కవర్ చేస్తుంది.

కాసర్‌గోడ్ – త్రివేండ్రం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ : కేరళకు రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురానికి ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.05 గంటలకు అక్కడికి చేరుకుంటుంది. అదే రోజు తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.05 గంటలకు త్రివేండ్రం నుంచి బయలుదేరి రాత్రి 11.55 గంటలకు కాసర్‌గోడ్ చేరుకుంటుంది.

ప్రస్తుతం భారతదేశం అంతటా 25 రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో నాలుగు నార్తర్న్ జోన్‌లో, 3 సదరన్, మరో 3 సెంట్రల్ జోన్‌లలో రన్ అవుతున్నాయి. వెస్ట్రన్, వెస్ట్ సెంట్రల్, నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లలో రెండు రైళ్లు చొప్పున వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు సేవలు అందిస్తున్నాయి. సౌత్ ఈస్ట్ సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్, సౌత్ ఈస్ట్రన్, ఈశాన్య ఫ్రాంటియర్, ఈస్ట్ సెంట్రల్‌, నైరుతి, ఈశాన్య రైల్వే జోన్లలో ఒక్కో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news