ఆధార్ కార్డు విషయంలో కేంద్ర సర్కారు ఇటీవల దేశ పౌరులకు ఓ కీలక సూచన చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మాస్క్ డ్ కాపీలను మాత్రమే ఇవ్వాలని ఆ ప్రకటనలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ సూచనలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వివిధ అవసరాల కోసం ఏ సంస్థకైనా, ఇంకా ఎవరికైనా ఆధార్ కార్డు ఇవ్వాల్సి వస్తే ఫోటో కాపీ ఆధార్ ఇవ్వద్దని ఆ ప్రకటనలో కేంద్రం పౌరులకు సూచించింది.
అలా చేస్తే మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. అయితే మాస్క్ డ్ కాపీ లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దీంతో ఆధార్ కార్డు దుర్వినియోగం అవడం కుదరదని వివరించింది కేంద్రం. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మాస్క్ ఆధార్ మాత్రమే ఇతరులతో పంచుకోవాలన్న ప్రకటనను విరమించుకున్నట్లు స్పష్టం చేసింది.