Air India: దిగ్గజ ఎయిర్లైన్స్ టాటా గ్రూప్ కి చెందిన ఎయిర్ ఇండియా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి కస్టమర్ కేర్ సర్వీసులను ప్రాంతీయ భాషలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే కస్టమర్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఏకంగా ఏడు ప్రాంతీయ భాషల్లో కస్టమర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటనని జారీ చేసింది.
ఏడు ప్రాంతీయ భాషల్లో తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళ భాషలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ భాషల్లో కస్టమర్ కేర్ సర్వీసులు అందించబోతోంది, అసిస్టెంట్ సర్వీసులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కొత్తగా ఐదు కాంటాక్ట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తరచుగా ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారితో పాటు ప్రీమియం కస్టమర్లకు ఈ సేవలు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఐవిఆర్ వ్యవస్థ ద్వారా కస్టమర్లకు మొబైల్ నెట్వర్క్ ఆధారంగా స్థానిక భాషకు ప్రాధాన్యతను ఇచ్చి ఆటోమేటిక్ గా గుర్తించబోతున్నారు. దీంతో వారు ప్రత్యేకంగా భాష నేర్చుకోక్కర్లేదు. తమ ప్రాంతీయ భాషలోనే అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విలువైన కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటనలో చెప్పింది. హైదరాబాద్ తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల నుంచి నిత్యం వందల మంది విమాన ప్రయాణాలు చేస్తారు. ఎక్కువగా ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. తెలుగు రాష్ట్రాలే కాదు తెలుగు వారికి సైతం తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.