వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయ పునాదులపై జ్ఞానవాపి మసీదును నిర్మించారనే వాదనల్లో నిజానిజాలను నిర్ధరించేందుకు భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) సంస్థను వారణాసి జిల్లా కోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది.
జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో ఏఎస్‌ఐ సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చిందని హిందూ పిటిషనర్ల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించిందని అన్నారు. మరోవైపు.. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని ఏఎస్‌ఐ సర్వే చేసేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని తెలిపారు. అలాగే ఏఎస్‌ఐ సర్వే తర్వాత నిజం బయటకు వస్తుందని.. జ్ఞానవాపి సమస్య పరిష్కారమవుతుందని తాను విశ్వసిస్తున్నానని కేశవ్ ప్రసాద్ మౌర్య అభిప్రాయపడ్డారు.