ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్ర జరగనుంది. ఈ నెల 29న ప్రారంభం కానున్న ఈ యాత్రకు జమ్మూ-కశ్మీర్లో రంగం సిద్ధం అవుతోంది. ఈ ఆగస్టు 19 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఇటీవల వరుస ఉగ్రదాడులు జరుగుతున్నందున ఈ యాత్రకు మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని సముద్ర మట్టానికి 12 వేల 700 అడుగుల ఎత్తులో కొలువుదీరిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఈ ఏడాది ఐదు లక్షల మందికిపైగా భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. యాత్ర సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
అవసరమైన సౌకర్యాలతో 17 తాత్కాలిక వసతి శిబిరాలను ఏర్పాటు చేసిన అధికారులు.. రహదారులు మూసివేయడం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. యాత్ర ప్రారంభానికి సూచకంగా శనివారం ప్రథమ పూజను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో సత్వర చర్యలు చేపట్టేలా సహాయక సిబ్బంది అందుబాటులో ఉండాలని సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.