పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరేనని, అందుకు నడి బజార్లో నిలబెట్టి ఆయనను శిక్షించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతుంటే ఆ పార్టీ నేతలకు బాధ అయితుందని, మరీ మా పార్టీ ఎమ్మెల్యేలను లాకొన్నప్పుడు ఈ బాధ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని భట్టి విక్రమార్కకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు.
మండలిలో ఎమ్మెల్సీలను కూడా కేసీఆర్ లాక్కున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలని అన్నారు. ఇక, సింగరేణిపై బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు అడుతున్నాయని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో సింగరేణిలో కార్మికుల సంఖ్య 71 వేలు ఉండేదని.. ఇప్పుడు వర్కర్ల సంఖ్య 21 వేలకు పడిపోయిందని అన్నారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ సింగరేణిని నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాలు ఎందుకని, కోకాపేటలో బీఆర్ఎస్కు ఇచ్చిన భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆ భూమి వేలం వేసి వచ్చిన డబ్బులు రుణమాఫీకి ఉపయోగించాలని
సూచించారు.