ఇటీవలే దేశంలో సీఏఏ చట్టం అమలుపై రెండుసార్లు అమెరికా జోక్యం చేసుకుని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ వెంటనే తిప్పికొట్టింది. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని తేల్చి చెప్పింది. మరోవైపు దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి సమన్లు అందుకుంది. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా అనవసర వ్యాఖ్యలు చేసింది.
కేజ్రీవాల్ అరెస్టు విషయంలో స్పందించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల మాట్లాడుతూ ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కాంగ్రెస్ ప్రస్తావననూ తీసుకొచ్చారు. ఈ కేసుల్లో నిష్పాక్షిక, పారదర్శక, కాలావధితో కూడిన విచారణను తాము కోరుకుంటున్నామంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేలా తమ బ్యాంకు ఖాతాలను పన్ను విభాగం స్తంభింపజేసిందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు తమ అవగాహనలో ఉన్నాయన్న మాథ్యూ.. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సహా ఈ కేసులన్నింటిలో తీసుకుంటున్న చర్యలను తాము నిశితంగా గమనిస్తామని వ్యాఖ్యానించారు.