బిహార్‌లో బీజేపీ సమావేశాలు.. తెలంగాణ నేతలను ఆకాశానికెత్తేసిన అమిత్ షా

-

జాతీయ సమావేశాల్లో తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు, ఉద్యమాలను జేపీ నడ్డా, అమిత్ షాలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే విజయమని జోస్యం చెబుతున్నారు. బిహార్ పాట్నాలో జరిగిన వివిధ మోర్చా కార్యక్రమాల్లో, జాతీయ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణ బీజేపీ చేస్తున్న పోరాటాలు, కార్యక్రమాల గురించి పదే పదే ప్రస్తావించారు.

తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పని చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఇటీవల జాతీయ నాయకులు 2 రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయాన్ని అమిత్ షా, జేపీ నడ్డా ప్రస్తావించారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పోరాటాలను పదేపడే ప్రస్తావించారు. ఆయన చేస్తున్న పాదయాత్రలు, యాత్రలను గురించి వివరించారు. వారు చేస్తున్నట్లుగానే మోర్చా నాయకులు చేస్తే బీజేపీ గెలుపు కచ్చితంగా సాధ్యం అవుతుందని అన్నారు. జాతీయ కార్యక్రమాల్లో తెలంగాణ ముచ్చట రావడంతో వివిధ మోర్చాలకు చెందిన తెలంగాణ నాయకులు చప్పట్లు కొట్టారు. ఆనందం వ్యక్తం చేశారు. తాము పడుతున్నకష్టాలను జాతీయ నాయకత్వం గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

పార్టీలో పైపదవుల్లో ఉన్న వాళ్లు గుర్తించి మెచ్చుకుంటే.. పార్టీ శ్రేణులు మరింత కష్టపడతారని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ లీడర్లు. అప్పుడే రాబోయే ఎన్నికల్లో గెలిచే వరకు ఉత్సాహంగా పని చేయగలరన్నారు. అది దృష్టిలో పెట్టుకునే అమిత్ షా, జేపీ నడ్డా పదే పదే తెలంగాణ నేతల పేర్లు జాతీయ సమావేశాల్లో తీస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news