కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి అనేక కార్పొరేట్, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. ఇప్పటికీ ఇంకా అనేక సంస్థలకు చెందిన ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇకపై వేతనాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే..
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి అందించే వేతనాల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. గూగుల్‌లో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1.40 లక్షల మంది పనిచేస్తున్నారు. వారిలో 60 శాతం మంది రానున్న రోజుల్లో ఆఫీసులకు వచ్చి పనిచేస్తారు. ఇక మరో 20 శాతం మంది కొత్త ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తారు. చివరిగా మిగిలిన 20 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి వేతనాలు మారనున్నాయి.
సాధారణంగా ఒక్కో ప్రదేశంలో ప్రజల జీవనానికి అయ్యే ఖర్చులు మారుతుంటాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఖర్చు తక్కువగా ఉంటుంది. అదే హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో జీవనానికి అయ్యే ఖర్చు పెరుగుతుంది. ఈ క్రమంలోనే గూగుల్ ఇదే ప్రాతిపదికన వేతనాలను అందించనుంది.
అంటే.. ఖర్చు తక్కువగా అయ్యే ప్రాంతాల్లో నివాసం ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే గూగుల్ ఇకపై తక్కువ వేతనం అందిస్తుంది. అదే ఖర్చు ఎక్కువ అయ్యే ప్రాంతాల్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే గూగుల్ ఎక్కువ వేతనం ఇస్తుంది. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు అందే వేతనాలు వారు నివాసం ఉండే ప్రాంతాలను బట్టి మారుతాయి. ఈ క్రమంలో గూగుల్ ఈ దిశగా ప్రణాళికలు రచిస్తోంది. కనుక ఇతర కంపెనీలు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే గ్రామాలు, పట్టణాల్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కన్నా నగరాల్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికే ఎక్కువ వేతనాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.