జమ్ము కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం భాటా ధురియన్ ప్రాంతానికి సమీపంలోని హైవేపై జరిగింది. పిడుగుపాటు కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జిల్లాకు 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
ఈ సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎటువంటి ఉగ్రకోణం ఇందులో లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.
పూంచ్ సరిహద్దు జిల్లా కావడం వల్ల ఉగ్రమూకల చొరబాటు ప్రయాత్నాలు జరుగుతుంటాయి. ఈ నెల ప్రారంభంలోనే నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పూంచ్ సెక్టార్లో పెద్ద చొరబాటు యత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. చొరబాటుదారులను వెంబడించే క్రమంలో ఓ వ్యక్తి చనిపోయాడు. మిగతా వారు అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో భద్రతను కూడా పెంచింది భారత సైన్యం.