జమ్ముకశ్మీర్లో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి లోయలో పడగా తొమ్మిది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడ్డారు. యాత్రికులంతా కత్రాలోని శివ ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణో దేవి మందిరానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 6.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఎంపీ ఒవైసీ ఈ ఘటనను ఖండిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.