భారత్‌లోకి పాక్ పడవ.. డ్రగ్స్‌ సీజ్ చేసి ఆరుగురిని అరెస్టు చేసిన ఏటీఎస్

-

సందు దొరికితే భారత్‌లో విధ్వంసం సృష్టించాలని చూస్తుంటాయి పాక్ విద్రోహక శక్తులు. అందుకే భారత సరిహద్దుల్లో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటారు. వారి కుయుక్తిని ఎప్పటికప్పుడు పసిగడుతూ భారత సైనికులు పాకిస్థాన్ శక్తుల ఆట కట్టిస్తుంటారు. కేవలం ప్రత్యక్ష బరిలోనే కాదు భారత్‌ను నాశనం చేయాలని పాక్ వేసే పరోక్ష ప్లాన్‌లను కూడా ఇండియా తిప్పిగొడుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.

పాకిస్థాన్‌ నుంచి భారత్​లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం పట్టుకుంది. అరేబియా మహాసముద్రంలో బోటు ద్వారా తరలిస్తున్న 40 కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం, కోస్టుగార్డు సిబ్బంది సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నాయి. ఈ ఘటనలో బోటును సీజ్‌ చేయడం సహా ఆరుగురు పాకిస్థానీలను అరెస్టు చేశారు.

కచ్‌ జిల్లా జకావ్‌ ఓడరేవు సమీపంలోని సముద్రంలో చేపలు పట్టే పడవ ద్వారా హెరాయిన్‌ తరలిస్తున్నట్లు కోస్టుగార్డు, ఏటీఎస్​ సిబ్బంది గుర్తించారు. వెంటనే సంయుక్త ఆపరేషన్‌ చేపట్టి దుండగులను పట్టుకున్నారు. మాదకద్రవ్యాలను గుజరాత్‌ తీరానికి చేర్చి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పంజాబ్‌ తరలించాలని పథక రచన చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news