సర్కారీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అవకతవకలపై పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా లోక్‌సభలో బిల్లును ప్రవేశ పెట్టింది. పోటీ పరీక్షల్లో ఎవరైనా మోసానికి పాల్పడితే పదేళ్ల జైలు శిక్షతో పాటు కోటి రూపాయలు జరిమానా విధించేలా బిల్లులో నిబంధనలను రూపొందించింది. ఈ మేరకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం రోజున లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ప్రతిపాదిత చట్టం విద్యార్థులను లక్ష్యంగా చేసుకోదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీతో పాటు ఇతరత్రా అవకతవకలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలకు వ్యతిరేకంగా చట్టం పని చేస్తుందని తెలిపారు. నిందితులతో ప్రభుత్వ ఉద్యోగులు కుమ్మక్కైనా చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ పరీక్షల పేపర్ లీకేజీ కారణంగా రాజస్థాన్, బిహార్, గుజరాత్, హరియాణా తదితర రాష్ట్రాలలో సర్కారీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం.