దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో తీవ్ర గందరగోళం నెలకొంది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. 10 మంది కో-ఆప్షన్ సభ్యులను నియమించడంపై.. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కార్పొరేటర్లు పరస్పరం వాగ్వాదానికి దిగారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు.. ప్రిసైడింగ్ అధికారిగా బీజేపీ కార్పొరేటర్ సత్యశర్మను.. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడంపైనా ఆప్ నేతలు మండిపడ్డారు. మేయర్ ఎన్నికను ప్రభావితం చేసేందుకే సక్సేనా ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు.
కో-ఆప్షన్ సభ్యుడిగా మనోజ్ కుమార్‌ను ప్రమాణం చేయాలని ప్రిసైడింగ్ అధికారి ఆహ్వానించడంపై అభ్యంతరం వ‌్యక్తం చేసిన ఆప్ నేతలు వెల్‌లోకి దూసుకెళ్లారు. అందుకు పోటీగా.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రధాని మోదీ లక్ష్యంగా ఆప్ నేతలు నినాదాలు చేశారు. ఫలితంగా సభ మొత్తం గందరగోళంగా మారింది. దీంతో, కొత్తగా ఎన్నికైన దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి సభ.. మేయర్, ఉప మేయర్లను ఎన్నుకోకుండానే వాయిదా పడిందని ప్రిసైడింగ్ అధికారి తెలిపారు. సభ జరిగే తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.