రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరీ ‘రాష్ట్రపత్ని’ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఉభయసభల్లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్లమెంట్‌లో భాజపా సభ్యులు నిరసనకు దిగి నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పదవిని అవమాన పరిచిందని.. ఆ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురువారం లోక్‌సభలో డిమాండ్ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియా గాంధీ ఆమోదించారంటూ ఇరానీ విరుచుకుపడ్డారు. ఆమె బలహీన వర్గాలకు వ్యతిరేకమంటూ దుయ్యబట్టారు. దీనిపై ఉభయ సభలు దద్దరిల్లాయి. దీంతో ఈరోజు కూడా వాయిదాలపర్వం కొనసాగుతోంది.
మరోపక్క కొవిడ్ నుంచి కోలుకొని సభకు వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా స్పందించారు. దీనిపై పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలియజేస్తోన్న భాజపా ఎంపీలకు మద్దతు పలికారు. ‘ఇది ఉద్దేశపూర్వంగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్య. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ వాడినపదం ఈ దుమారానికి దారి తీసింది. కాగా ఈ నిరసనల నేపథ్యంలో ఆయన వెంటనే క్షమాపణలు తెలియజేశారు. పొరపాటున నోరు జారినట్లు అంగీకరించారు. ధరలపెరుగుదల, జీఎస్టీ, అగ్నిపథ్‌పై దేశ ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ విషయాన్ని భాజపా పెద్దది చేస్తోందని విమర్శించారు. కాగా, ఈ నిరసనలపై సోనియా స్పందిస్తూ.. ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పారని మీడియాకు వెల్లడించారు.