దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనేక ప్రజల జీవితాలను చిన్నా భిన్నం చేసింది. ఇప్పటికీ కోవిడ్‌పై ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు. మూడో వేవ్ వస్తుందేమోనని భయపడుతున్నారు. దీంతో మరింత తీవ్రంగా పరిస్థితులు మారుతాయని ఆందోళన చెందుతున్నారు. అయితే కోవిడ్ మూడో వేవ్ ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన దృష్ట్యా వారిలో బ్లాక్ ఫంగస్ వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటంటే..
ములుంద్ ప్రాంతంలోని ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ జెసల్ షెత్ ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ ముప్పు చిన్నారులకు తక్కువగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడే వారికి మాత్రమే బ్లాక్ ఫంగస్ వస్తుందని చెబుతున్న నేపథ్యంలో చిన్నారులు ఆ రెండు విభాగాల్లో ఉండరు. కనుక వారికి బ్లాక్ ఫంగస్ ముప్పు తక్కువేనని అన్నారు.
అయినప్పటికీ చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందేనని తెలిపారు. చిన్నారుల్లో బ్లాక్ ఫంగస్ వస్తే అప్రత్తమై జాగ్రత్తలు పాటించాలని, చికిత్స అందించాలని అన్నారు. వారిలో బ్లాక్ ఫంగస్ వస్తే పలు లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
బ్లాక్ ఫంగస్ సోకిన చిన్నారుల్లో తలనొప్పి, నుదుటి భాగంలో వాపులు, ముఖం వాపులు కనిపిస్తాయి. ముక్కు చుట్టూ నల్లగా మచ్చల్లాంటివి ఏర్పడుతాయి. చూపు సరిగ్గా ఉండదు. మసకగా కనిపిస్తుంది. ఛాతి నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాస్పిటల్‌లో చేర్పించి చికిత్సను అందించాలని తెలిపారు.
చిన్నారుల్లో బ్లాక్ ఫంగస్ రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కళ్లు, ముక్కు, నోరు ను టచ్ చేయకుండా చూసుకోవాలని, శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించేలా చూడాలని, ఇంట్లోనే ఉంచాలని, మాస్కును ఎల్లప్పుడూ ధరించేలా చూడాలని, చేతులను శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. దీంతో బ్లాక్ ఫంగస్ వచ్చే ముప్పును తగ్గించవచ్చని చెబుతున్నారు.