క‌రోనా దెబ్బ‌కు రూ.4 లక్షల కోట్లు ఫ‌ట్‌..!

-

క‌రోనా వైర‌స్ అన్ని రంగాల‌ను కోలుకోలేని దెబ్బ‌తీస్తోంది. తాజాగా.. క‌రోనా దెబ్బ‌కు దేశీయ స్టాక్‌ మార్కెట్లు విల‌విలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకుతోడు.. దేశీయంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం మదుపరులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. యూరప్‌ దేశాల్లో మ‌రోమారు కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. దీంతో ఆయా దేశాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉండటం మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు వెల్లడించాయి. అలాగే.. భారత్‌-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా మదుపరులను ఆగ‌మాగం చేశాయి. దీంతో అన్ని రంగాల షేర్లు కుప్ప‌కూలాయి.

దీంతో మార్కెట్లకు సోమవారం బ్లాక్‌మండేగా నిలిచింది. 38,812 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఒక దశలో 38,990 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇంట్రాడేలో 38 వేల దిగువకు అంటే.. 37,938కి జారుకున్నది. చివరకు 811.68 పాయింట్లు లేదా 2.09 శాతం క్షీణించి 38,034.14 వద్ద ముగియ‌డం గ‌మ‌నార్హం. ఇక జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 254.40 పాయింట్లు లేదా 2.21 శాతం పతనమై 11,250.55 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరులు ఏకంగా రూ.4 లక్షలకోట్లకు పైగా సంపదను కోల్పోయారు. బీఎస్‌ఈ జాబితాలో ఉన్న‌ సంస్థల మార్కెట్‌ విలువ రూ.4,23,139.78 కోట్లు తగ్గి రూ.1,54,76,979.16 కోట్లకు పడిపోయింది. టెలికం, రియల్టీ, మెటల్‌, ఆటో, హెల్త్‌కేర్‌ రంగ షేర్లు ఆరు శాతం వరకు నష్టపోయాయి. స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమైనప్పటికీ రూపాయి మాత్రం కోలుకున్నది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 7 పైసలు పెరిగి 73.38 వద్ద నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news