మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డ త‌నిష్క్‌.. బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజ‌న్ల పిలుపు..

ప్ర‌ముఖ జ్యువెల్ల‌రీ విక్ర‌య‌దారు త‌నిష్క్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డింది. ఇటీవ‌లే త‌నిష్క్ తీసిన ఓ యాడ్ వివాదాస్ప‌దంగా మారింది. ఓ వ‌ర్గానికి చెందిన వారు ఆ యాడ్ త‌మ‌ను కించ ప‌రిచే విధంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. త‌నిష్క్ ల‌వ్ జిహాద్‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని, వెంట‌నే ఆ యాడ్‌ను తీసేయాల‌ని డిమాండ్ చేశారు. అయితే త‌నిష్క్ వెంట‌నే ఆ యాడ్‌ను తొల‌గించింది. కానీ దీపావళి నేప‌థ్యంలో మ‌రోసారి ఇంకో యాడ్ తీసిన త‌నిష్క్ ఈసారి కూడా అభాసుపాల‌వుతోంది.

దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా బాణ‌సంచా కాల్చ‌రాద‌ని, కేవ‌లం దీపాలు వెలిగించి పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని త‌నిష్క్ యాడ్ తీసింది. అందులో అలయా ఎఫ్‌, నిమ్ర‌త్ కౌర్‌, స‌యాని గుప్తా, నీనా గుప్తాలు న‌టించారు. అయితే దీపావ‌ళి యాడ్ కూడా వివాదాస్ప‌ద‌మైంది. క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీటీ ర‌వి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫైర‌య్యారు. హిందువులు పండుగ‌ల‌ను ఎలా సెల‌బ్రేట్ చేసుకోవాల‌నే విష‌యాన్ని మాత్ర‌మే ఎందుకు చెబుతారు ? క‌ంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌పై దృష్టి పెడితే బాగుంటుంది, ఒక వ‌ర్గానికి చెందిన వారి సంస్క్రృతి సంప్ర‌దాయాల‌పై లెక్చ‌ర్లు ఇవ్వ‌కూడ‌దు, దీపావ‌ళిని ఎలా సెల‌బ్రేట్ చేసుకోవాలో చెప్పాల్సిన ప‌నిలేదు, మేం దీపాల‌ను వెలిగిస్తాం, స్వీట్ల‌ను పంచుకుంటాం, గ్రీన్ బాణ‌సంచా కాలుస్తాం, అంద‌రూ క‌లిసి రండి, ఏక‌త్వం అంటే ఏమిటో తెలుస్తుంది.. అని అన్నారు.

కాగా త‌నిష్క్ తీసిన దీపావ‌ళి యాడ్‌పై కూడా సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు భ‌గ్గుమంటున్నారు. దీంతో త‌నిష్క్ ఆ యాడ్‌ను కూడా తొల‌గించింది. అయిన‌ప్ప‌టికీ నెటిజ‌న్ల ఆగ్ర‌హ జ్వాల‌లు త‌గ్గలేదు. త‌నిష్క్ పై వారు తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాయ్‌కాట్ త‌నిష్క్ (#boycotttanishq) పేరిట హ్యాష్ ట్యాగ్‌ను ర‌న్ చేస్తున్నారు.