ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా సామూహిక వివాహాలు జరిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా కొంత నగదు కూడా చెల్లిస్తోంది. అయితే ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు ఆ రాష్ట్రంలో ఏకంగా అన్నా చెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్‌లో ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 38 నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘనంగా వివాహాలు జరిపించింది. అయితే ఆ రోజు ఓ యువతి పథకం ద్వారా వచ్చే సొమ్ము, కానుకల కోసం కక్కుర్తిపడి తన సోదరుడితో పెళ్లి పీటలు ఎక్కింది. ఆమెకు ఏడాది క్రితమే వివాహం జరగ్గా, ప్రస్తుతం భర్త జీవనోపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. సమాచారం తెలిసిన అతడు అధికారులకు విషయాన్ని చేరవేయడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు యువతికి ఈ పథకం ద్వారా అందజేసిన నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.