దేశ రాజధాని దిల్లీలో గులాబీ సౌధాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్‌ను ఇవాళ మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత భవన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మ. 1:05 గంటలకు రిబ్బన్ కట్ చేసి భవన్‌లోకి ప్రవేశించారు. భవన్‌లో దుర్గామాత అమ్మవారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం భవనంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌కు కేసీఆర్ వెళ్లి కుర్చీలో ఆసీనులయ్యారు. కేసీఆర్‌కు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కేసీఆర్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు, వెంకటేశ్ నేత, సంతోష్ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.