అమరావతి భూ కుంభకోణం పై ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం ఇచ్చిన ఈ తీర్పుని స్వాగతిస్తున్నామని అన్నారు రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత. ఈ సందర్భంగా బుధవారం కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు.
గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరగకపోతే దర్యాప్తును ప్రాథమిక దశలోనే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. తప్పు చేశామని భయం ఉండబట్టే స్టే తెచ్చుకున్నారని అన్నారు మంత్రి. విచారణను ఎదుర్కొని వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు హయంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు.