ఇవాళ దేశం అడుగడుగునా సవాళ్లతో సావాసం చేస్తోంది. ఆర్థిక పరంగా వైద్య పరంగా ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి.గత బడ్జెట్ ల కన్నా హీనంగా ఈ బడ్జెట్ ఉంది. అస్సలు వరాలే లేవు. సామాన్యుడికి ఏం సాయం చేశారో ఒక్కటంటే ఒక్కటి చెప్పమనండి. పాపం ఉద్యోగులకు కూడా అదేవిధంగా ఆదాయపు పన్ను శ్లాబులు మారుస్తారని అనుకున్నారు కానీ అది కూడా వాళ్లకు లేకుండా చేశారు.
అన్ని రంగాలను నిరాశలో ఉంచి ఈ మంగళవారం ఎవ్వరికీ ఏవీ దక్కకుండా సారీ దక్కనీయకుండా నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని అత్యంత పేలవమయిన రీతిలో ముగించడం ఈ రోజు విషాదం.ఈ ఏడాది ఆరంభ విషాదం కూడా ఇదే! ఇక పోస్ట్ బడ్జెట్ సెషన్ లో అయినా తెలుగు రాష్ట్రాలకు ఏమిస్తారో అన్నది నిర్మలా సీతారామన్ చెబుతారేమో!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో అంతా అంకెల గారడీనే కనిపించింది తప్ప సామాన్యులకు మేలు చేద్దాం అన్న తపన లేదు.సంకల్పం అంత కన్నా లేదు. బడ్జెట్లో ఒక్కటంటే ఒక్క వరం లేదు.ఆర్థిక రంగానికి చేయూత లేదు. వైద్య రంగానికి ఊరట లేదు.శాస్త్ర సాంకేతిక రంగాల ఊసేలేదు. పోనీ రక్షణ రంగానికి అయినా ఏమయినా ఇచ్చారంటే ఆ గంటన్నర ఊకదంపుడు ప్రసంగంలో వాటి ఊసే లేదు. అస్సలు ఏమీ ఇవ్వని బడ్జెట్ గా దేశ చరిత్రలోనే ఇది నిలిచిపోవడం ఖాయం.
సాధారణంగా బడ్జెట్ అంటే కనీసం ఉపాధి హామీ పథకం లాంటి కేంద్ర ప్రాయోజిత పథకాలపై కూడా మాట్లాడాలి.అది కూడా ఆమె చేయలేదు.అంతేకాదు అస్సలు తెలుగు రాష్ట్రాల జీవన్మరణ సమస్య విభజన చట్టం.దానిపై కూడా మాట్లాడలేదు. ఎవ్వరికీ అవసరం లేనివి, ఎవ్వరికీ అర్థం కానివి మాత్రం హాయిగా చెప్పి నవ్వి వెళ్లారు.
ఇప్పుడు కొత్త రైళ్ల ఊసులో అయినా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఉందా అంటే అదీ లేదు.దేశం మొత్తం ఎదురు చూసిన బడ్జెట్లో ఏమీ లేవు. ఇకపై ఉండవు కూడా అని తేలిపోయింది.
రెవెన్యూ లోటు 17 లక్షల కోట్లు అని తేల్చారు. అదేవిధంగా అంచనా బడ్జెట్ ను నలభై లక్షల కోట్ల రూపాయలతో (దాదాపు) ఎలా రూపొందించారో అన్నది కూడా ఆ దేవుడికే తెలియాలి. లేదా ఆయనే తేల్చాలి.