ముంబైలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

మహారాష్ట్ర: ముంబైలో అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మల్వాని ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలు విడిచారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 30 మందిదాకా ఉన్నట్లు చెబుతున్నారు. మృతుల్లో చిన్న పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న 15మందిని ఎన్డీఆర్ బృందాలు రక్షించాయి. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి అస్లాం షేక్ ఘటనా స్థలానికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ముంబైలో భారీ వర్షాలు పడుతుండటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ముంబయి మహానగరంలో భారీ వర్షం కురవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీ వరదతో పాటు రైల్వే ట్రాక్‌లపై నీళ్లు నిలిచిపోవటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయి సెంట్రల్. ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్‌ నుంచి వివిధ రైళ్ల రాకపోకలు ఆలస్య మయ్యాయి.

ముంబయి తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో దాదాపు 50 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. బేలాపూర్‌లో 168 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం వల్ల ముంబయిలో లోతట్టు ప్రాంతాలు, కింగ్ సర్కిల్ గాంధీ మార్కెట్ ఏరియా, సియోన్, మిలన్, విలే పార్లే ఏరియాలు నీటమునిగాయి. ముంబయికి ప్రాణాధారమైన లోకల్ రైళ్ల రాకపోకలపై భారీ వర్షాలు ఆటంకంగా మారాయి.