ప్రభుత్వ ఉద్యోగులారా! ఇకపై మీరు వాట్సాప్ వాడొద్దు.. మీ మీ డేటాను టెలిగ్రామ్ యాప్ ద్వారా సెండ్ చేయవద్దు..ముఖ్యంగా ఆఫీసుకు సంబంధించి ఏ డేటా అయినా ఈ రెండు యాప్స్ కోసం కేటాయించవద్దు. ఇవి ఎంతమాత్రం భద్రతాపరంగా హామీ ఇవ్వని సంస్థలు.ఇప్పటికే దఫదఫాలుగా కేంద్రం ఈ సంస్థలను హెచ్చరించినా కూడా ఫలితం లేకపోయింది.ఆఖరికి స్వీయ నియంత్రిత చర్యల్లో భాగంగా కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.వీటి ప్రకారం ఆ రెండు యాప్స్ ను వాడకూడదని, అస్సలు వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్లెవ్వరయినా సరే ఆఫీసులో రూపొందించిన ఇ అప్లికేషన్స్ ను మాత్రమే వాడితే మేలు అని విన్నవిస్తోంది. ఏదేమయినప్పటికీ దేశీయ పరిజ్ఞానంతో పనిచేసే యాప్స్ ను మాత్రమే వీలున్నంత వరకూ డేటా మార్పిడి కి కానీ బదిలీకి కానీ వాడితే ప్రయోజనం బాగుంటుందని హ్యాకింగ్ కు పెద్దగా ఆస్కారం ఉండదని, కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే డేటా సురక్షితంగా ఉంటుందని కేంద్రం అంటోంది.
ముఖ్యంగా డేటా హ్యాకింగ్ అన్నది ఇటీవల విరివిగా జరిగిపోతోంది.అదేవిధంగా దేశ అంతర్గత వ్యవహారాల లీకేజీ కూడా సులువుగానే సాగిపోతుందన్న ఆరోపణలు ఈ యాప్స్ వల్లనే వస్తున్నాయి. వీటిపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడం అన్నది సాధ్యం కాదు కనుక ఉద్యోగుల వరకూ నిషేధాన్ని కొనసాగించాలని, నియంత్రణ లేకపోతే దేశానికే పెను ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు వీడియో కాన్ఫరెన్సులకు ఉపయోగిస్తున్న జూమ్ కానీ గూగుల్ మీట్ యాప్స్ ను కానీ అస్సలు వాడొద్దని అంటోంది. వీటి స్థానంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(NIS) డెవలప్ చేసిన యాప్స్ నే వాడాలని పదే పదే విన్నవిస్తోంది.