కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు, సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ కేంద్రాలకు కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆస్పత్రుల్లోని వైద్యులు.. తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ మందులనే రాయలని(ప్రిస్క్రైబ్ చేయాలని) కేంద్రం సూచించింది. దీనికి భిన్నంగా వ్యవహరించే డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
అలాగే ఆసుపత్రుల ప్రాంగణాలకు మెడికల్ రిప్రజెంటేటివ్‌ల రాకపోకలను పూర్తిగా తగ్గించేలా చూడాలని కేంద్రం కోరింది. ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ ఈ నెల 12న అధికారిక ఆదేశాలు జారీ చేశారు. కొందరు వైద్యులు రోగులకు జనరిక్ మందులకు బదులు బ్రాండెడ్ మందులు రాస్తున్న దృష్టాంతాల నేపథ్యంలో ఈ పరిస్థితిని నివారించేందుకు ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లలేక తమకు వద్దకు వస్తున్న పేద ప్రజలకు ప్రస్తుతం కొందరు వైద్యులు రాస్తున్న బ్రాండెడ్ మందులు భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.