భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇస్రో ప్రయోగాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్-3 ప్రయోగానికి తేదీ ఖరారు చేసింది. ఏపీలోని తిరుపతి జిల్లాలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ఏడాది జులై 12న వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆగస్టు 23 లోపు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ కాలుమోపే అవకాశముంది.
2019లో చంద్రయాన్-2 విఫలమైన తర్వాత చంద్రయాన్-3 మిషన్‌కు ఇస్రో శ్రీకారం చుట్టింది. కొవిడ్-19 నేపథ్యంలో కొంత ఆలస్యమైనా.. గత అనుభవాల నేపథ్యంలో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తాజా ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఎల్‌వీఎం-3 వాహకనౌక చంద్రయాన్-3 ల్యాండర్‌ను జాబిల్లిపైకి మోసుకెళ్లనుంది. వంద కిలోమీటర్ల ఎత్తు కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెట్టాక జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేసే ప్రక్రియ చేపట్టనున్నారు.
చంద్రయాన్-2కు సంబంధించి 2019 సెప్టెంబరు 7న అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30-2.30 గంటల మధ్యలో చంద్రుడిపై ల్యాండింగ్ కావల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. తర్వాత అది క్రాస్ ల్యాండింగ్ అయి.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన తర్వాత ఇస్రో దాని వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఉపరితలాన్ని ఢీకొట్టి ముక్కలైంది.