కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ కుంభకోణంలో ఆయన్ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో సీఎంను విచారించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఏ స్కామ్ కేసులో ఆయణ్ను విచారిస్తున్నారు..? అసలు ఆ కుంభకోణం ఏంటంటే..?
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ-ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ముడా స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సీఎం పాత్ర ఉందని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు.
ముడాలో అవకతవకలపై సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు టీజే అబ్రహం వేసిన పిటిషన్‌పై తాజాగా గవర్నర్ నోటీసులు జారీ చేశారు. సిద్ధరామయ్య భార్య బిఎమ్ పార్వతికి చట్టవిరుద్ధంగా మైసూరులోని పలు ప్రాంతాల్లో 14 చోట్ల స్థలాల కేటాయింపులు జరిగాయని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని తన పిటిషన్ లో పేర్కొన్నారు.