తమిళనాడులో ప్రభుత్వానికి.. గవర్నర్కు మధ్య మరో జగడం షురూ అయింది. తాజాగా గవర్నర్ RN రవిని బర్తరఫ్ చేయాలని, ఉన్నత పదవిలో కొనసాగేందుకు ఆయన అర్హుడు కాదని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. గవర్నర్ రవి రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, తమిళనాడులో శాంతి భద్రతలకు ముప్పుగా పరిణమించారని స్టాలిన్ లేఖలో ఆరోపించారు. రాజ్యాంగంలోని 159వ అధికరణ ప్రకారం చేసిన ప్రమాణాన్ని గవర్నర్ RN రవి ఉల్లంఘించారని పేర్కొన్నారు.
ఇటీవల గవర్నర్ RN రవి.. మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఏకపక్షంగా బర్తరఫ్ చేయటం, ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని సీఎం స్టాలిన్ తన లేఖలో ప్రస్తావించారు. గవర్నర్ ఫక్తు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించేందుకు జాప్యం చేస్తున్న గవర్నర్.. మంత్రి వి.సెంథిల్ బాలాజీ విషయంలో తొందరపాటుతో వ్యవహరించారని సీఎం స్టాలిన్ ఫిర్యాదు చేశారు. ఈ చర్యల ద్వారా గవర్నర్ ఉన్నత పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని, ఆయన్ను పదవి నుంచి తప్పించాలని సీఎం స్టాలిన్.. రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.