మీకు కాంగ్రెస్ పార్టీ అన్నా, రాహుల్ గాంధీ నాయకత్వం అన్నా ఇష్టమా ? కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా ? అయితే మీకు ఆ పార్టీ అధినాయకత్వం సదవకాశం కల్పిస్తోంది. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో యాక్టివ్‌గా పనిచేసేందుకు భారీ ఎత్తున సోషల్ మీడియా వారియర్లను రిక్రూట్ చేసుకుంటోంది. కనుక మీకు కూడా ఆసక్తి ఉంటే జాయిన్ కావచ్చు.
ఈ భారీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెయిడ్ ట్రోల్ ఆర్మీ పెరిగిందన్నారు. వారు దేశంలో హింస, అల్లర్లు చెలరేగేందుకు కారణమవుతున్నారని ఆరోపించారు. దానికి కౌంటర్ వేయాలంటే భారీగా సోషల్ మీడియా వారియర్లు అవసరం అవుతారని అన్నారు. అందులో భాగంగానే ఈ డ్రైవ్‌ను చేపట్టినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఆసక్తి ఉన్నవారు కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నంబర్ లేదా వాట్సాప్ నంబర్‌లను సంప్రదించి సదరు వారియర్‌గా చేరవచ్చు. సోషల్ మీడియాలో బీజేపీకి చాలా బలం ఉంది. దానికి సమానంగా తాము కూడా డిజిటల్ స్పేస్‌ను ఆక్రమించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తోంది. మరి ఇందులో సఫలీకృతం అవుతుందా, లేదా.. చూడాలి.