ప్రపంచ వ్యాప్తంగా ఏడాదిన్నర కాలం నుంచి కోవిడ్ వల్ల ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. చాలా మంది ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయారు. ఇంకా కోవిడ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. మన దేశంలో మూడో వేవ్ రానప్పటికీ పలు దేశాలు ఇప్పటికే ఆ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే మరో 6 నెలల్లో కోవిడ్ అంతమవుతుందని ఇటీవలి కాలంలో వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో వాటిపై నిపుణులు కూడా స్పందించారు. వారు ఏమంటున్నారంటే..
మరో 6 నెలల్లో కోవిడ్ అంతమవుతుంది.. అనే వార్తలపై అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు మైకేల్ ఆస్టర్ హోమ్ స్పందిస్తూ.. కరోనా ఇప్పుడప్పుడే అంతమయ్యే అవకాశం లేదన్నారు. మరి కొన్నేళ్ల వరకు కోవిడ్ ప్రభావాన్ని అనుభవించక తప్పదన్నారు. ప్రపంచంలో ఇంకా చాలా మందికి టీకాలు వేయలేదు. అందువల్ల కోవిడ్ ఇప్పుడప్పుడే అంతం కాదు. ఇంకా అనేక వేవ్‌లు వస్తాయి. తరువాతే కోవిడ్ పోతుంది.. అని ఆయన అభిప్రాయ పడ్డారు. అందువల్ల మరో 6 నెలల్లో కోవిడ్ అంతం అవుతుందని భావించకూడదని.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.
ఇదే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టు కాంత సుబ్బారావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో కరోనా వైరస్‌కు చెందిన మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. టీకాలను ఇంకా చాలా మంది తీసుకోనందున కోవిడ్ మరో 6 నెలల్లో అంతం కాదని, అందుకు ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందని అన్నారు.