షాకింగ్‌.. కోవిడ్‌తో చ‌నిపోయిన వ్య‌క్తి మృత‌దేహాన్ని న‌దిలో పారేశారు.. వీడియో..!

గంగాన‌దిలో కొన్ని చోట్ల వంద‌ల సంఖ్య‌లో క‌రోనా మృత‌దేహాలు కొట్టుకురావ‌డం సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం విదిత‌మే. అయితే ఆ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే అలాంటిదే ఇంకో సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌రు వ్య‌క్తులు కోవిడ్ తో చ‌నిపోయిన వ్య‌క్తి మృత‌దేహాన్ని న‌దిలో పారేశారు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ల‌రామ్‌పూర్ వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తులు ఓ మృత‌దేహాన్ని బ్రిడ్జి మీద నుంచి న‌దిలోకి పారేశారు. అందులో ఓ వ్య‌క్తి పీపీఈ కిట్ ధ‌రించి ఉన్నాడు. అటుగా వెళ్తున్న కొంద‌రు ఆ సంఘ‌ట‌న‌ను చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇది అధికారుల దాకా వెళ్లింది. దీంతో వారు స్పందించి ఆ వ్య‌క్తులను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. వారిపై కేసు న‌మోదు చేశారు.

కోవిడ్‌తో చ‌నిపోయిన వ్య‌క్తి మృత‌దేహాన్ని అత‌ని బంధువులు ఇద్ద‌రికి అప్ప‌గించామని, వారు మృత‌దేహాన్ని ఖ‌న‌నం లేదా ద‌హ‌నం చేయ‌కుండా న‌దిలో పారేశార‌ని అధికారుల విచార‌ణ‌లో తేలింది. దీంతో ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేశారు. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘాజిపూర్‌, బ‌ల్లియా జిల్లాల్లో గంగా న‌దిలో గ‌త కొద్ది రోజులుగా కరోనాతో చ‌నిపోయిన వారి మృత‌దేహాలు వ‌స్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో మృత‌దేహాల‌ను ఖ‌న‌నం లేదా ద‌హ‌నం చేయాల‌ని కేంద్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.