శ్రీనగర్: జమ్ముకశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా అభివృద్ధి మండళ్లు (డీసీసీ), పంచాయతీ ఉప ఎన్నికలకు ఈ రోజు నుంచి పోలింగ్ నిర్వహించనున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
జమ్మూకశ్మీర్ లో ప్రాంతీయ పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తో పాటు మరికొన్ని సంఘాలు కలిసి ఏర్పాటు చేసుకున్న గుప్ కార్ కూటమి, బీజేపీ పార్టీల మధ్య ఎన్నికల యుద్ధం నెలకొంది. దాదాపు ఏడు లక్షల మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూకశ్మీర్ ను పునర్ వ్యవస్థీకరణ చేసిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.
స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ఎనిమిది విడతల్లో నిర్వహించబోతున్నట్లు ఎన్నికల అధికారులు తెలియజేశారు. నేడు తొలిదశ ఎన్నికలు నిర్వహించనున్నారని, చివరి విడత ఎన్నికలు డిసెంబర్ 19వ తేదీన జరగనున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 22వ తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా 1,427 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారులు తెలిపారు. తొలి విడతలో 296 మంది బరిలో ఉన్నారని.. వీరిలో 207 మంది పురషులు, 89 మంది మహిళలు పోటీ చేస్తున్నారన్నారు.
దాదాపు ఏడు లక్షల మంది ఉన్న ఓటర్లలో 3.27 లక్షల మంది కశ్మీర్, 3.28 లక్షల మంది జమ్మూ డివిజన్ చెందిన వారని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. మొత్తంగా 2,146 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో 280 డీడీసీ స్థానాలుండగా.. తొలి విడతలో 43 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. భద్రత కోసం 145 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల్ని మోహరించారు. పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.