విమానాల ప్రమాదంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరా

దేశంలో ఇవాళ గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్‌ జెట్లు కూలిపోగా.. రాజస్థాన్‌లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది.

రోజువారీ శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి గాల్లోకి ఎగిరిన సుఖోయ్‌-30, మిరాజ్‌ 2000 విమానాలు కాసేపటికే మొరెనా ప్రాంతంలో కూలిపోయినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారని జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

మరోవైపు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో యుద్ధ విమానం కూలిపోయింది. ఇక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనలో పైలట్‌ వివరాలు తెలియలేదు. వీటిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ రెండు ఘటనలపై రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదాలపై రాజ్​నాథ్ విచారం వ్యక్తం చేశారు. విమాన సిబ్బంది పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విమానాలు ఢీకొన్న ఘటనపై ఎయిర్‌చీఫ్ మార్షల్‌తో మాట్లాడారు.