జలదిగ్బంధంలోనే దిల్లీ.. ఆప్ సర్కార్ అసమర్థతే కారణమని బీజేపీ ఫైర్

-

యమునా నది శాంతించినా ఇంకా దిల్లీ జలదిగ్బంధంలోనే ఉంది. భారీ వర్షాలతో దిల్లీ మహానగరం అతలాకుతలమవుతోంది. రహదారులపై నీళ్లు నిలిచి చెరువుల్లా మారిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఓవైపు ఇప్పటికే వరదలతో సతమతమవుతున్న దిల్లీ ప్రజలకు వాతావరణ కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. ఇవాళ నగరంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎగువ నుంచి భారీ వరదతో యమునా నదిలో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ప్రమాద స్థాయి మించి 206.02 మీటర్ల మేర నదిలో ప్రవాహం చేరుతోంది.

అయితే దిల్లీలో వచ్చిన వరదలకు ఆప్‌ సర్కార్‌ అసమర్థత, అవినీతే కారణమని బీజేపీ ఆరోపించింది. పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమైనందుకు.. దిల్లీ సీఎం  కేజ్రీవాల్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. ఆప్‌ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా యమునా నదిలో పూడిక తీయనందునే….వరదలు వచ్చాయని ఆరోపించింది. యమునా నది ప్రక్షాళన కోసం 6వేల 8వందల కోట్లు కేటాయిస్తే.. అందులో ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news