దేశ రాజధానిలో యమునా నది క్షణక్షణం భయం కలిగిస్తోంది. మహోగ్రరూపం దాల్చిన ఈ నది ప్రవాహం నిమిషానికోసారి పెరిగిపోతోంది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో దిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. ఇవాళ ఉదయం 9 గంటల సమయానికి నది నీటి మట్టం 208.51 మీటర్లకు చేరింది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది.
యమునా నది ఉప్పొంగడంతో సమీప ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కశ్మీరీ గేట్ – మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం, దిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది. మరోవైపు వరద ముప్పు దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు 12 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించారు.