అక్కడ ఎన్నికల విధుల్లో సాధారణ ఉద్యోగులు కాదు.. దివ్యాంగ ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా దివ్యాంగులు పనిచేసేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొ దివ్యాంగ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులే అన్ని విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. దివ్యాంగులు కూడా ఏ పనినైనా చేయగలరనే సందేశాన్ని సమాజానికి ఇచ్చేందుకే ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే వెల్లడించారు. దివ్యాంగ పోలింగ్ కేంద్రంలో నలుగురు దివ్యాంగ సిబ్బంది, వీరికి మరో ఇద్దరు సహకరిస్తారని పేర్కొన్నారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కొక్కటి చొప్పున తొమ్మిది దివ్యాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల విధుల నుంచి సెలవు కోరేవారికి దివ్యాంగ పోలింగ్ కేంద్రాలు ఓ గుణపాఠమని ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే తెలిపారు.