నామినేషన్ల ప్రక్రియ మొదలై నాలుగు రోజులు కావొస్తున్నా ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో కాంగ్రెస్ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానానికి పేరు దాదాపు ఖరారైనట్లేనని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు మరోపేరు తెరపైకి వచ్చింది.
కాంగ్రెస్ తరఫున ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావుల పేర్లు ఇప్పటికే తెరపైకి రాగా తాజాగా ఇదే జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనను గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. అయితే ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొని పేరు ప్రకటించడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొందరు నాగేశ్వరరావు పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం.
కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 25తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. కాబట్టి సోమ లేదా మంగళవారాల్లో ఈ మూడు నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించవచ్చని నేతలు భావిస్తున్నారు.