సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల తర్వాత వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామంటూనో, సర్వేల పేర్లతోనో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రకటనల ద్వారా, మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ విధానాన్ని వీడాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సర్వేల మధ్య ఉండే విభజన రేఖను కొన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చెరిపివేసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఈసీ వ్యాఖ్యానించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇలాంటి వాటిని అవినీతికి పాల్పడడంగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు పంపించిన సూచనల్లో ఈ కీలక సూచనలు చేసింది. ఈ తరహా అనైతిక చర్యలపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులనూ ఈసీ ఆదేశించింది.