మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఐదుగురు రోగులు, ముగ్గురు ఆసుపత్రి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. జబల్‌పూర్‌లోని దామోహ్ నాకా ప్రాంతంలో ఉన్న న్యూలైఫ్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఆస్పత్రిలోని రోగులు భయాందోళనకు గురయ్యారు. హాహాకారాలు చేస్తూ.. పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది ఆసుపత్రి వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్పత్రిలోని రోగులను బయటకు తరలించారు. షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
‘ఆస్పత్రిలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. ఏమైందోనని వెళ్లి చూస్తే అందరు పరిగెడుతున్నారు. ఆరా తీస్తే అగ్నిప్రమాదం జరిగిందని తెలిసింది. వెంటనే మా కుటుంబ సభ్యులను తీసుకుని బయటకు పరుగులు తీశాం.’ అని ఆస్పత్రిలో రోగులకు సహాయంగా వచ్చిన వారు చెప్పారు.