కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో యెస్ బ్యాంకులో ఏర్పడిన సంక్షోభం కారణంగా కొంత కాలం పాటు బ్యాంకు కార్యకలాపాలపై మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆ బ్యాంకు కస్టమర్లకు నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు విధించారు. అయితే సరిగ్గా ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంక్‌కు కూడా అలాంటి స్థితే ఎదురైంది. ఆ బ్యాంక్‌పై కూడా మారటోరియం విధించారు. దీంతో కస్టమర్ల నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దరఖాస్తు మేరకు 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం సెక్షన్ 45 సబ్-సెక్షన్ 2 కింద నవంబర్ 17 సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు.. అంటే సుమారుగా నెల రోజుల పాటు లక్ష్మీ విలాస్ బ్యాంక్‌పై మారటోరియం అమలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ బ్యాంక్‌కు చెందిన కస్టమర్లు నెలలో కేవలం రూ.25వేలను మాత్రమే విత్ డ్రా చేసేందుకు వీలుంటుంది.
అయితే లక్ష్మీ విలాస్ బ్యాంకుపై మారటోరియం విధించి, నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు పెట్టినా కస్టమర్ల డబ్బుకు ఎలాంటి ఢోకా లేదని, వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐలు తెలిపాయి. బ్యాంకులో ఏర్పడిన సంక్షోభం మూలంగానే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కాగా కిందటి నెలలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ రేటింగ్‌ను బిబి మైనస్‌కు తగ్గించింది. ఈ నేపథ్యంలో ఈ బ్యాంకుపై తాజాగా మారటోరియం విధించడం చర్చనీయాంశమవుతోంది.