లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది. దేశ చరిత్రలో సుదీర్ఘ కాలంపాటు జరుగుతున్న ఈ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 19వ తేదీ నుంచి జూన్ ఒకటి వరకు 44 రోజులపాటు ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుండగా, తొలి విడత కోసం ఎన్నికల సంఘం సన్నాహాల్లో బిజీగా ఉంది. ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ సహా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్‌లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో రెండేసి, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. మణిపుర్‌లో రెండు స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నా.. ఔటర్ మణిపుర్ నియోజకవర్గంలో మాత్రం మొదటి రెండు దశల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. యూపీలో 8, బిహార్‌లో 4, బంగాల్‌లో 3 నియోజకవర్గాల్లో, అసోంలో 5, ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 5, రాజస్థాన్ 12, జమ్ముకశ్మీర్‌లో ఒక నియోజకవర్గానికి ఈనెల 19న ఓటింగ్ నిర్వహించనున్నారు.