వంతెనపై నుంచి బస్సు పడిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఐదుగురు దుర్మరణం చెందారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో జాజ్పుర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను రక్షించారు. అప్పటికే ఐదుగురు మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మొత్తం 47మంది ప్రయాణికులతో పూరీ నుంచి బంగాల్కు సోమవారం మధ్యాహ్నం బస్సు బయలుదేరగా.. రాత్రి సయమంలో జాజ్పుర్లోని 16వ జాతీయ రహదారిపై బారాబతి వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఫ్లైఓవర్ పైనుంచి బస్సు రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.