అయోధ్య బాలక్ రామ్ ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరుపుకున్న బాలరాముడిని చూసేందుకు భారీగా భక్తులు పోటెత్తారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజే పెద్ద ఎత్తున శ్రీరామ భక్తులు తరలివచ్చారు. తొలిరోజున సుమారు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు శ్రీరాజమ జన్మమందిర ట్రస్ట్ వెల్లడించింది. మంగళవారం రోజున ఉదయం ఆరు గంటలకే పెద్దసంఖ్యలో ఆలయానికి పోటెత్తారని తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు రెండున్నర లక్షల మంది రామయ్యను దర్శించుకున్నట్లు చెప్పింది.
భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారిని నియంత్రించడం అధికారులు, పోలీసులకు కష్టమైంది. ఒక దశలో స్వల్ప తొక్కిసలాట కూడా జరగగా.. మధ్యాహ్నం తర్వాత భక్తులను నియంత్రించి, క్రమపద్ధతిలో దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి పది గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పించారు. మరోవైపు, ఆలయం వద్ద పరిస్థితిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా దర్శనానికి ఏర్పాట్లు చేయాలని ట్రస్టుకు సూచించారు.